Thursday, May 31, 2018

సంవాదం 4 - భగవంతుడు ఇంతవరకు దొరకలేదే!

సాధకుడు-- ప్రణామాలు గురుదేవ.
గురువు-- మనోవాంఛా ఫలసిద్ధిరస్తు.
సాధకుడు-- ఎట్లా సిద్ధిస్తుంది గురుదేవా? నా మనోకామన ఈశ్వరుని పొందటం కదా. దీని అవకాశాలు దూరంలో కూడా ఎక్కడా దృష్టిగోచరం కావటంలేదే!
గురువు-- ఎందుకు, ఏమైంది నాయనా?
సాధకుడు-- నేను చాలానే సాధన చేశాను. ఎన్నో ప్రయాసలు పడ్డాను. నాకేమేం చేయమని చెప్పారో అవన్నీ చేశాను.. కానీ ఇప్పటిదాకా భగవంతుడి కాలి గోరు కూడా కనిపించలేదు.
గురువు-- ఔనా, నీవు ఏమేం చేశావు?
సాధకుడు-- నేనా? స్తోత్రాలు చదివాను, జపాలు చేశాను, ఉపవాసాలు ఉన్నాను, తీర్థయాత్రలు చేశాను, నదీ స్నానాలు చేశాను, ప్రదక్షిణలు చేశాను, ఎన్నో మందిరాలలో దర్శనాలు చేసుకున్నాను, ఇంకా చాలా దానాలు, పుణ్యాలు చేశాను.. ఇవే కదా మీరు చెప్పినవి.
గురువు-- ఔను నిజమే.
సాధకుడు-- ఏంటి నిజం? చూడండి, ఇదంతా భగవత్ ప్రాప్తి కొరకే కదా చేసినది. మరి భగవంతుడు ఎందుకు దొరకటం లేదు?
గురువు-- ఎప్పటి నుండి చేస్తున్నావిదంతా?
సాధకుడు-- అదే, ఎప్పుడు మిమ్మల్ని కలిశానో అప్పటినించి ఈ పనులలోనే ఉన్నాను. ఏ ఇతర కార్యమూ చేయకుండా ఎక్కువగా ఈ పనులనే చేస్తుంటాను.. రెండేళ్ళైంది.
గురువు-- ఔనా, రెండు ఏళ్ళు అయ్యాయా? అబ్బో..
సాధకుడు-- ఔను.. ఇంకెన్నేళ్ళు నేను ప్రతీక్షించాలి? కాస్త త్వరగా ఇది జరిగే ఉపాయం లేదా? ఏదైనా ఇతర ప్రయత్నం చేయనా?
గురువు-- రోజులో ఎంతసేపు చేస్తున్నావు, జపం, స్తోత్రపాఠాలు?
సాధకుడు-- అది దాదాపు రెండు, మూడు గంటలు.
గురువు-- ఔనా, రెండు-మూడు గంటలే, అబ్బో!
సాధకుడు-- ఆఁ. మీరు చెప్పిన తరువాత ఒక్క రోజు కూడా నేను క్రమం తప్పలేదు. ఎన్ని పనులు వచ్చిపడినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా- నేను అంత సమయం వరకు ఎప్పుడూ ఆ సాధనలను చేశాను, మీరు చెప్పినదంతా అదే విధంగా చేశాను. అన్ని నియమాలను పాటించాను. ఇవ్వాల్టి దాకా ఒక్క నియమమూ తప్పలేదు..
గురువు-- ఓహ్, చాలా గొప్ప విషయం.
సాధకుడు-- మీరే అన్నారుగా, భక్తిపూర్వకంగా చేస్తే సిద్ధి త్వరగా దొరుకుతుందని.
గురువు-- ఔను, దొరుకుతుంది. అది సరే, నీతో పాటు వచ్చిన ఈ పసివాడు ఎవరు?
సాధకుడు-- వీడు నా అన్నకొడుకు, ఆరేళ్ళవాడు.
గురువు-- ఏం చేస్తున్నాడు?
సాధకుడు-- చదువుతున్నాడు. పాఠశాలకు పోతాడు. ఇప్పుడు మొదటి తరగతిలోకి వచ్చాడు..
గురువు-- ఎప్పటినుంచి వెళ్తున్నాడు విద్యాలయానికి?
సాధకుడు-- అది..., కేజీలో బడిలో వేశాము, అయితే రెండేళ్ళైంది వెళ్ళబట్టి.
గురువు-- అబ్బో, అయితే ఇంకా వీడికి ఉద్యోగం రాలేదా?
సాధకుడు-- ఉద్యోగమా??!!
గురువు-- ఔను, ఉద్యోగమే! చదువుకునేది ఉద్యోగం కోసమే కదా?
సాధకుడు-- ఔను అంతే.. కానీ ఉద్యోగం రావాలంటే ఈనాటి లెక్కలో కనీసం పీజీ అయినా కావాలి. దానికి ఇంకా ౧౭ ఏళ్ళు సమయం ఉంది.
గురువు-- అబ్బో ఇంకా ఉద్యోగం చేయాలంటే ౧౭ ఏళ్ళు వీడు చదువుకోవాలా??
సాధకుడు-- మరి కాకపోతే? పదో తరగతి దాకా విద్యాలయంలో, తదుపరి రెండేళ్ళు ఇంటరు, ఆ పైన మూడేళ్ళు డిగ్రీ, లేదా నాలుగేళ్ళ ఇంజీనీరింగు, లేదంటే వీడి భాగ్యంలో ఏది ఉంటే అది. అప్పుడు పీజీ!! అక్కడికి కానీ ఉద్యోగం గురించి ఆలోచనైనా చేయలేము.
గురువు-- ఓహ్, దానికన్నా ముందు ఏమీ చేయలేమా??
సాధకుడు-- లేదండి. అట్టి వ్యవస్థ ఏమీ లేదు. ఆ తరువాత కూడా వాడికి భాగ్యం ఉంటేనే ఉద్యోగం దొరికేది.
గురువు-- ఏఁ? వీడు సరిగ్గా చదవడా? నియమ పాలనం చేయడా? అధ్యాపకులు చెప్పింది అంతా సరిగ్గా వినడా?
సాధకుడు-- అయ్యో, ఎందుకు చేయడు? యూనిఫార్మ్ వేసుకుంటాడు. చదువుతాడు, టై, బూట్లు, బాడ్జి, పుస్తకాల సంచీ అన్నీ వీడే చూసుకుంటాడు.. వేళకే బడికి పోతాడు, ఇంటికి వస్తాడు, గృహకార్యం కూడా చక్కగా చేస్తాడు. బాగా మనసు పెట్టి చదువుతాడు.
గురువు-- అబ్బో, ఎన్ని గంటలు చదువుతాడు వీడు ఒక రోజులో?
సాధకుడు-- ఉదయం 9:00 ఇంటికి బడికి పోతాడు, 3:00 గటలకు తిరిగి వస్తాడు. మళ్ళీ ట్యూషనుకు పోతాడు. అక్కడ సాయింత్రం వరకు చదువుకుంటాడు.
గురువు-- ఔనా? ఇన్ని గంటలు చదివినా కూడా వీడికి ఉద్యోగం వచ్చే అవకాశం లేదా?
సాధకుడు-- లేదు. వీడు ఇంకా చాలా చిన్నవాడు. ఉద్యోగానికి సరిపడే వయసు లేనివాడు.
గురువు-- అరే, పిల్లవాడు చాలా తెలివికలవాడుగానే కనిపిస్తున్నాడే! అయినా ఉద్యోగం వచ్చే వ్యవస్థ లేదంటావా?
సాధకుడు-- ఆఁ, అట్టి వ్యవస్థేదీ లేదసలు. మీకన్నీ తెలుసు కదా అయినా ఎందుకు ఇట్లా అడుగుతున్నారు?
గురువు-- ఒక లౌకికమైన సామాన్యమైన ఉద్యోగం కోసం ౧౭ ఏళ్ళు చదవాల్సి ఉంటే, విద్యాలయం-మహావిద్యాలయం మొదలైన చోట్లకు పోయి కొన్ని గంటల పాటు చదువులకని, పరీక్షలకని వెచ్చించాల్సి వస్తుందే, మరి భగవంతుడి ఆరాధనకై కేవలం రెండు ఏళ్ళలో నీకు ఫలితం ఎట్లా దొరుకుతుంది? స్వయంగా ఆలోచించు.
సాధకుడు-- ఔను, నిజమే. అర్థమైంది. క్షమించండి. ఇంకెప్పుడూ నిరాశ చెందను.
గురువు-- శుభం భూయాత్॥
--సంకా ఉషారాణి

1 comment: