గురువు-- ఎక్కడున్నావు ఇన్ని రోజులు?
శిష్యుడు-- పరీక్షకు చదువుకుంటున్నాను. సివిల్స్.
గురువు-- అయితే పరీక్ష అయిపోయిందా?
శిష్యుడు-- అయింది.
గురువు-- ఎట్లా వ్రాశావు?
శిష్యుడు-- చాలా బాగా వ్రాశాను. చదువుకోసం వేరే అన్నీ పనులు విడిచి పక్కకు
పెట్టేశాను. చాలా ప్రయాస చేశాను. అనుకున్న దానికన్నా చాలా బాగా వ్రాశాను. చాలా
సంతుష్టి కలిగింది.
గురువు-- చెప్పు ఇంక. దేనికై ఈ రాక?
శిష్యుడు-- ఏం లేదు, సాధన గురించిన కొన్ని
ప్రశ్నలు అడగాలి. చాలా రోజులుగా జపం చేస్తున్నాను. ఏం ఫలం లభించలేదు.
గురువు-- ఎంత జపం చేస్తావు?
శిష్యుడు-- ప్రతిదినం ఒక వెయ్యి చేస్తాను.
గురువు-- ప్రతిదినం ఇరవై వేలు చేయగలిగిన రోజు వచ్చి చెప్పు. దానికన్నా ముందర
ఫలం గురించి మాట్లాడవద్దు.
శిష్యుడు-- ఇది ఎట్ల సంభవం, గురుదేవా? నేను విద్యార్థిని కదా. రేపుదయం ఉద్యోగాన్వేషణ చేయాలి.
ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి. నిర్వహించాలి. ఒక రోజుకు ఇరవై వేలు జపం అంటే నాకు కనీసం 10 గంటలు పడతాయి. ఎక్కడి నుంచి తేను ఇంత సమయాన్ని?
గురువు-- అయితే ఫలం అడగద్దు. కావాలసినంత పరిమాణంలో సాధన చేయలేనప్పుడు, దాని ఫలం చింత విడిచివేయటమే మంచిది. ఎంత చేస్తున్నావో అంత
ఫలం నీకు అవశ్యం లభిస్తోంది కదా. కానీ నీవెంత ఫలం కోరుతున్నావో దానికోసం ఎక్కువ
కాలాన్ని వెచ్చించాల్సిందే. లేదంటే దొరకదు.
శిష్యుడు-- ఇది చాలా అన్యాయం గురుదేవా. మావంటి వారికి ఇంక ఏం సాధన గురించిన
ఆశైనా వ్యర్థమేనా? ఎవరైనా ఇల్లు వాకిళ్ళ
వారు, గృహస్థులు జపం-సాధనలు ఎట్ల
చేయాలి? సమయం ఎక్కడ దొరుకుతుంది? ఇంట్లో ఇంత అశాంతిగా ఉంటుంది. మిత్రులు, బంధువులు, కుటుంబం.. అందరిని
చూసుకుంటూ ఎక్కడ అవుతుంది? వీటి గురించి కల కూడా
కనద్దా ఇంక?
గురువు-- మొన్నే నీ పరీక్ష అయింది కదా. దానికి నువ్వు ఎన్ని గంటలు చదివావు?
శిష్యుడు-- దానికా? స్నానం, నిద్ర, తినటం- ఇంతవరకు
ఆవశ్యకమైన పనులను వదిలి మిగిలిన సమయం అంతా చదువుకే వెచ్చించాను, అప్పుడు కానీ పరీక్ష బాగా వ్రాయలేకపోయాను.
గురువు-- అయితే అప్పుడు ఇంటి బాధ్యతలు లేవా? పనులు లేవా? ఇల్లు శాంతి మందిరం అయిపోయిందా? మిత్రులు బంధువులు కుటుంబం వారి పట్ల కర్తవ్యాలు లేవా?
శిష్యుడు-- అన్నీ ఉన్నాయి. అక్కడే ఉన్నాయి. కొద్దిగా కూడా తక్కువ కాలేదు.
అందువల్లే నాకు పరీక్షకు చదవటం చాలా కష్టం అయింది. చాలా అలసిపోయాను.
గురువు-- అయినా నువ్వు చేశావా లేదా?
శిష్యుడు-- ఔను, చేశాను.
గురువు-- ఇదంతా నీకు పరీక్ష కోసం కలలు కనే వేళ తెలుసా?
శిష్యుడు-- తెలుసు, చాలా బాగా ఎరుగుదును.
అది అసంభవాన్ని సంభవం చేయటమే అయింది. నేను ప్రవాహానికి ఎదురీది గంగ దాటాను.
గురువు-- అయితే పరిస్థితులూ అవే, అవే బాధ్యతలు, ఆ కర్తవ్యాలే- నువ్వు పరీక్షకోసం సన్నద్ధం కావటానికి ఆటంకం
కాలేకపోయిన్పపుడు జపం సాధనలలో ఎందుకు అవుతున్నాయి?
శిష్యుడు-- నిజమే ప్రశ్న సరైనదే. కానీ పరీక్షకు చదివేది కేవలం నలభై రోజులే.
ఇంత సమయం కోసం ఇంట్లో అందరిని ఒప్పించాను. సహకరించండని ప్రార్థించాను. అప్పుడు
కానీ చదవలేకపోయాను.
గురువు-- అయితే మరి జపం-సాధనలు వగైరా కోసం కూడా మండలం అనే చెప్పారు.
అంతకాలానికే నియమాలు వ్రతాలు దీక్షలు చెప్పింది మన ధర్మం. దానికన్నా ఎక్కువ చేయమని
ఎవ్వరూ చెప్పరే. ఏదైనా జపం సిద్ధి కై లేదా విశిష్ట ఫలం పొందటానికై ఇంత సమయం
గడపవలసిందే. దీనికన్నా తక్కువవి కూడా ఉన్నాయి- ఏకాహాలు, సప్తాహాలు, ఇరవై ఒక్క రోజులు..
ఇత్యాదులు.
శిష్యుడు-- ఔను, ఒప్పుకుంటాను.
గురువు-- ఇన్ని కర్తవ్యాల మధ్య ఎట్లైతే కేవలం ఐఏఎస్ పరీక్ష దృష్టితోనే నీ నలభై
రోజులను పూర్తిగా నింపేసుకున్నావో, అంతే సమయం, అదే విధానంగా ఇందులో పెట్టు. ఇంకా చెప్పాలంటే, నీ పరీక్ష కోసం నువ్వు రోజంతా చదవవలసి వచ్చింది. కానీ జపం
కోసం కేవలం కొన్ని గంటలు మాత్రమే పడతాయి. ఇంకా దానికోసం నువ్వు పెద్ద విశేషంగా ఏ
వ్యవస్థా చేసుకోనక్కరలేదు. పుస్తకాలు, అధ్యాపకులు, సన్నద్ధతలు ఏమీ అక్కరే లేదు.
శిష్యుడు-- ఔను, సత్యమే. గురుదేవుల
ఆశీర్వచనంతో నిర్దేశం అందితే, అన్నీ సానుకూలమైతాయి.
గురువు-- లౌకిక ఫలాలలో వ్యక్తి చాలా సమయం పరిశ్రమ, ప్రయత్నం పెడతాడు. కానీ అదే మనం సాధన దిశగా చేయి అని చెప్తే, జనాలకు అన్నీ వంకలు గుర్తుకు వస్తాయి. సాధనను కఠినం అని
అనేస్తారు. అంతే, ఇదే రహస్యం. ఇంకేం లేదు. ఇచ్ఛ
ఉన్న ఫలం కోసం ప్రయత్నం అయితే చేసి తీరాల్సిందే. తగినంత ప్రయత్నం లేకుండా ఫలం
కావాలన్నా దొరికేదెట్లా?॥
⛳💞🙏
--ఉషారాణీ సంకా
(శ్రీశారదామాత (రామకృష్ణపరమహంస గారి
భార్య) పుస్తకంలో నిర్దేశం తో ప్రేరితమై,
ఒక
వైయక్తిక ఘటనా పై ఆధారితమైన లేఖ)
------------------------------
No comments:
Post a Comment