Wednesday, May 30, 2018

సంవాదం 2 - సంన్యాసి లౌకికుడు- ఒక సంవాదం

లౌకికుడు-- మీరు ఏం పని చేస్తారు?
సంన్యాసి-- ఈ వస్త్రాలకు తగిన పని చేస్తాను.
లౌకికుడు-- నేనైతే ఎన్నడూ ఒక యోగి, సంన్యాసి, సాధువు ఎవ్వరినీ ఒక పని చేస్తూ చూడలేదు. వీరివల్ల సమాజానికి ఏం ప్రయోజనం సిద్ధించదు.
సంన్యాసి-- ఔనా. సరే, ఫరవాలేదు.
లౌకికుడు-- ఎన్నడూ సంన్యాసులు తమ కాళ్ళ మీద తాము నిలబడరు. ఏమీ సంపాదించరు, వారికి ఇల్లు కూడా సొంతం ఉండదు. అన్ని వస్తువులకోసం సమాజంపై ఆధారపడతారు. ఉత్త తిరుగుబోతులు ఉంటారు. కనీసం అమ్మ నాన్నలపట్ల కూడా వారికి బాధ్యత ఉండదు. చాలా మందికి అక్షరజ్ఞానం కూడా ఉండదు.
సంన్యాసి-- ఔను, కానీ తపస్సు చేసుకోవటానికి ఇదంతా ఆవశ్యకం..
లౌకికుడు-- ఎటువంటి తపస్సు? తినటం తాగటం మానివేయటమా? శరీరాన్ని తపింపచేయటమా? పీడించటమా? శోషింపచేయటమా? శారీరిక సుఖాలనుండి దూరం ఉండటమా? ఇదంతా సాడిజం, అఘాయిత్యం.. సైకాలజీ ప్రకారం చాలా తప్పు. ఎప్పుడూ వ్యక్తి ఆత్మపీడ చేసుకోరాదు. అది ఆత్మహత్యతో సమానం.
సంన్యాసి-- ఔను, కానీ అది అభ్యాసంలో ఒక భాగం కదా.
లౌకికుడు-- ఏం అభ్యాసం? దేనికోసం? ఇల్లూ వాకిలీ వదిలి, జనాలను విడిచి, పని వదిలిపెట్టి, వివాహం చేసుకోకుండా ఏంటది? అట్ల చేయటం వల్ల వారి మానసికత ఎంత పాడైపోతుందో. వారి వంశంకూడా ఆగిపోతుంది.
సంన్యాసి-- ఔను, కానీ వారు ఇదంతా ఒక పరమార్థ ప్రయోజనం కోసం చేస్తారు.
లౌకికుడు-- పరమార్థమా? నేనైతే ఏ పరమార్థమూ చూడలేదే. నిజం చెప్పాలంటే, తప్పు వీరిది కాదు. గురువులు వారికి అంతా నూరిపోస్తారు. వారు పాడైతారు, అందరిని పాడు చేస్తారు. తమ సేవ పేరు మీద అందరి మీద పెత్తనం చేస్తారు. మా కోచ్ సార్ మిమ్మల్ని కలవమన్నారని వచ్చాను, లేదంటే వచ్చేవాడినే కాదు.
సంన్యాసి-- సరే మీకెట్ల సరి అనిపిస్తే అదే కానీ. అది సరే, ఇంతకూ మీరేం చేస్తుంటారు?
లౌకికుడు-- నేను అథిలీట్ ని. పరిగెత్తుతాను- దేశం కోసం. నా జీవనం అంతా ఈ క్రీడలోనే పెట్టాను.
సంన్యాసి-- అచ్ఛా. ఏమేం పెట్టారు?
లౌకికుడు-- ఏమేం పెట్టలేదో అడగండి! సమయం, శ్రమ, ధనం- అన్నీ పెట్టాను. ఎన్నో ఏళ్ళ నుంచి అభ్యాసం చేస్తున్నాను.
సంన్యాసి-- చాలామంచిది. ఎవరు మీ ప్రేరణా?
లౌకికుడు-- అది, మా కోచ్. చాలా మంచి కోచ్ దొరికారు నాకు. చాలా మార్గదర్శనం ఇచ్చారు. నాకు కోచ్ ఏది చెప్తే అదే చేశాను.
సంన్యాసి-- కోచ్ ఏం చెప్పారు మీకు?
లౌకికుడు-- కోచ్? అదే! నాయనా, ఎక్కువ సమయం అభ్యాసంలో పెట్టాలి. ఎప్పుడూ మత్తు సేవించద్దు. పైసలకోసం ఆశ పడద్దు.. అమ్మాయిల వలయంలో పడద్దు.. పైసలు ప్రేమ కూడా మత్తు వంటివే.. వాటి వలయంలో పడితే క్రీడకు దూరం అవుతాము. ఆడటం అసంభవం అవుతుంది. శరీరం మనస్సు బలహీనం అవుతాయి..
సంన్యాసి-- అయితే మీరు వివాహం చేసుకోలేదా?
లౌకికుడు-- లేదు. కోచ్ సర్ స్కూల్ నేనే నడుపుతాను. అందుకని వివాహం చేసుకోలేదు. తరువాత కూడా చేసుకోవాలని లేదు.
సంన్యాసి-- అయితే అమ్మానాన్నలను ఎవరు చూసుకుంటారు?
లౌకికుడు-- అది, నాన్నగారు ఇంకా క్రియాశీలంగానే ఉన్నారు. అమ్మ కూడా సమర్థురాలే. నాకు ఒక అన్న ఉన్నాడు. ఆయన అన్నీ చూసుకుంటాడు. 
సంన్యాసి-- ఎంత సమయం ఇంట్లో ఉంటావు?
లౌకికుడు-- అది, చాలా తక్కువ సమయమే ఇంట్లో ఉండేది. నేను చిన్నతనం నుంచీ ఆటలోనే ఎక్కువ సమయం గడిపేవాడిని.
సంన్యాసి-- ఇదంతా చేశారు, ప్రతిఫలం ఏం దొరికింది?
లౌకికుడు-- చాలా. పైసలు, పేరు, గౌరవం, ప్రభుత్వం వైపునుంచి ఇల్లు - అన్నింటిని మించి ఆత్మ సంతృప్తి.
సంన్యాసి-- అచ్ఛా, మీకు ఆకలి అవుతున్నట్టుంది. ఈ పాలు తాగండి. ఎవరో ఇచ్చి వెళ్ళారు. సంన్యాసిని, ఎక్కువేం ఉండదు నా దగ్గర.
లౌకికుడు-- ఇంత మీగడ పాలా? అమ్మో, దీనితో కోలెస్ట్రాల్ పెరుగుతుంది. నేను సరిగ్గా ఉరకలేనింక.
సంన్యాసి-- మీరు శరీరాన్ని ఇంత శోషణ ఎందుకు చేస్తున్నారు?
లౌకికుడు-- శోషణా? నేను చాలా సంయమనం ఉంచుకోవాలి. అథిలీట్ ని ఉత్తగనే కాలేదు కదా.
సంన్యాసి-- వహ్వా, ఇప్పటిదాకా జరిగిన సంభాషణతో తెలిసిందేమంటే నేను చేసిందంతా మీరూ చేశారు. అయినా మీరు చేస్తే సంయమనం, మేము చేస్తే శోషణా?
లౌకికుడు-- ఏంటి?
సంన్యాసి-- ఔను. మీరే కాదు, ఎవ్వరైనా ఒకటి సాధించాలి అనుకునే ప్రతీవాడు, ఇదే చేస్తాడు. క్రీడాకారులు, సైనికులు, పోలీసులు, డిటెక్టివ్ లు, విద్యార్థులు, సంగీత-నృత్య-కళాకారులు, లేఖకులు, చిత్రకారులు, సినిమా వారు, పరిశోధకులు- అందరూ. తమ తమ క్షేత్రాలలో ముందుకు పోవటానికి ఎంతో త్యాగం చేస్తునే ఉంటారు. సమయం, ధనం, మనోరంజనం, మిత్రులు, బంధువులు, ఇల్లు, తల్లిదండ్రులను- అందరిని వదిలి సాగుతారు. తిరుగుబోతులు కూడా అవుతారు. అభ్యాసం చేయటంలోనే మనస్సును పెడతారు. ఈ సంసారంలో ఏదైనా పరిశ్రమ, తపస్సు చేయకుండా దొరకదు.
లౌకికుడు-- ఒప్పుకుంటాను. కానీ వారి ఫలం కనిపిస్తుంది. లేఖకుడు కథలు వ్రాస్తాడు, విద్యార్థి పరీక్షలు ఉత్తీర్ణుడు అయి  వృత్తిని పొంది ధనం సంపాదిస్తాడు, పోషిస్తాడు. అట్లాగే మిగితావారు కూడా. మీరు అంతా చేసీ ఏం జరగదు కదా.
సంన్యాసి-- ఇది లోపలి యాత్ర. ఏదైనా జరిగింది జరగనిది లోపలి నుంచి తెలుస్తుంది. కనిపించే ఫలితం లేదు ఇందులో. అనుభూతి చెందే ఫలం. మీరు ఏ ఆత్మసంతృప్తి గురించి చెప్పారో, అట్లాగే ఇది ఆత్మ వైపుగా సాగే యాత్ర, స్వాధ్యాయం  పథం. ఇక్కడ అనంతమైన శాంతి ఉంది. ఎంతో ఆనందం ఉంది ఈ మార్గంలో. కామక్రోధాది శత్రువులతో పోరాటం ఉంది,  భగవత్ప్రాప్తి కోసం ప్రయత్నం లో ఉంటాము. సంసారాన్ని త్యాగం చేయటం మొదటి పదం, ఈ సోపాన క్రమంలో.
లౌకికుడు-- క్షమిచండి. అర్థమైంది.
సంన్యాసి-- ఏం అర్థమైంది?
లౌకికుడు-- ఇక్కడకు వచ్చి కూర్చున్నది మొదలు, లోపల ఒక ప్రశాంతతా, హాయీ అనుభవమవుతున్నాయి. నాకు ఇక్కడకు రాకముందు బాగా తలనెప్పి ఉండింది.. ఇప్పుడు లేదు. ఇదివరకెన్నడూ ఇంత వివాదం చేస్తుంటే అవతలివారు శాంతంగా సమాధానం చెప్పటం వినలేదు. ఇక్కడి వాతావరణ అంతా ఒక తెలియని నిఃశబ్దంగా ఉంది. అప్పటినుంచి ఇదే మాటను లోలోపలే ఆలోచిస్తున్నాను. దీనితో మీ తపస్సు ఎంత లోతైనదో తెలుస్తుంది. అందుకే పంపి ఉంటారు మా కోచ్ సర్ మీ వద్దకు నన్ను. ఇంకెప్పుడూ ఏ సాధువునూ నిందించను. క్షమించండి.
సంన్యాసి-- అస్తు. శుభం భూయాత్॥

--ఉషారాణీ సంకా

No comments:

Post a Comment